Andhra Pradesh: దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం కేసుల్లో ఏపీలోనే 39.86 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Read Also: TIrupati Canal death: కాలువలో దూకిన యువకుడి డెడ్ బాడీ లభ్యం
ఈ జాబితాలో ఏపీ తర్వాతి స్థానంలో బీహార్‌లోని పట్నా హైకోర్టు ఉంది. పట్నా హైకోర్టులో 6,554 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో 6,236 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా అత్యధిక కుక్కకాటు నమోదైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022లో నవంబర్ నెల నాటికి ఏపీలో 1,69,378 కుక్కకాటు కేసులు నమోదైనట్లు కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. తెలంగాణలో 80,282 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.