ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు గుప్పించారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్ నిర్ణయాలు.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Also: బండి సంజయ్ దాడి ఘటన.. తెలంగాణ సీఎస్, డీజీపీ, అధికారులకు సమన్లు జారీ
రెండో వేవ్‌లో కరోనా క్వారంటైన్ సెంటర్ల నిర్వహాకులకు ఇంత వరకు చెల్లింపులు చేయలేదన్నారు. మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. సంపద సృష్టించడం చేతకాక, OTS పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్లకు వైసీపీ తెర లేపిందన్నారు. ఆఖరికి చెత్త, డ్రైనేజి మీద పన్నులు వసూలు చేస్తున్నారని ఇదేం ప్రభుత్వమని అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. అయినా జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతామని చెప్పడానికి సిగ్గులేదా..? అమ్మా ! భారతమ్మ ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే.. సీఎంకి ఏదో అయిందని అనుమానంగా ఉంది వెంటనే ఆస్పత్రిలో చూపించండి.. లేదంటే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శల దాడులకు దిగారు.