Gorantla Madhav Challenge to Tdp Leaders: తన వీడియో వ్యవహారం తర్వాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తొలిసారిగా అనంతపురం వస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కురువ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బళ్ళారి చౌరస్తా వద్ద ఆలయంలో గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అనంతపురం బయలుదేరి వెళ్తుండగా ఆయన మాట్లాడుతూ.. తన వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని టీడీపీ నేతలు చెప్పడం వింతగా ఉందన్నారు. తన వీడియో ఫేక్ అని పోలీసులు నిర్ధారించారని.. అయినా టీడీపీ దుష్ప్రచారం చేయడం తగదని సూచించారు. టీడీపీ నేతలే ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసుల్లా, జడ్జిల్లా, సైంటిస్టుల్లా, ఇతర అధికారుల్లా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. పోలీస్ వ్యవస్థ తన కోసం సృష్టించింది కాదనే సంగతి టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని గోరంట్ల మాధవ్ సూచించారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయనివ్వాలని హితవు పలికారు. బ్రిటీష్ కాలం నుంచి పోలీస్ వ్యవస్థ ఉందనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు.
Read Also: Shocking Video: పాముపై కాలేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
ఒరిజినల్ వీడియో తన దగ్గర ఉందని.. పోలీసులు అడిగితే తన ఫోన్ ఇస్తానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వీడియోను స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తే తాను కూడా తన వీడియోను దర్యాప్తు చేయించేందుకు సిద్ధమన్నారు. అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చంద్రబాబు ఓటుకు నోటు వీడియో పరీక్ష చేయించి తప్పుడు వీడియో అని నిరూపించగలరా అని టీడీపీ నేతలకు గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. చంద్రబాబు వీడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్ చేయించగలరా అని ప్రశ్నించారు. బీసీలపై కత్తిపెట్టి అణగదొక్కుతున్నారని. .అందుకే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తనను గెలిపించిన ప్రజలలో తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, చులకన చేసేందుకు ప్రయత్నించాలని చూస్తే ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు.