ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చేలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. సంఘటనా స్థలానికి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చేరుకుని, సంఘటన జరగటానికి కారణాలను విచారించి వివరాలను సేకరించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది ఉన్నట్టు సమాచారం.