గుడివాడలో జరిగిన ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు వెల్లడించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఆరుగురు సభ్యులతో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామని, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టీడీపీ నాయకులు వచ్చారన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగా అదుపు చేశారని ఆయన తెలిపారు.
నిబంధనలను అతిక్రమించి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వందలాది మందితో నిజ నిర్ధారణ కమిటీ వెళ్లడంలో, కుట్రకోణం ఉందా అన్న అంశంపై విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. గుడివాడలో జరిగిన ఘటనపై ఎస్పీ నేతృత్వంలో కమిటీ విచారణ చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగానే, ఆరుగురు సభ్యులతో టీడీపీ నిజనిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు.