రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్‌సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ‘శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్‌సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన అన్నారు. ఈ ముగ్గుర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బహుజనులు అందరిపైనా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఏ ఒక్క పార్టీ బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలను తన సొంత తోబుట్టువులు మాదిరిగా బీసీల సంక్షేమాన్ని, రాజకీయంగా అగ్రస్థానంలో ఉంచారన్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారుల ఖాతాలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తే, ఒక్క బీసీలకే ఒక లక్షా, 80 వేల కోట్లు అందజేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. గత టీడీపీ పాలనలో ఏనాడూ బీసీలను గుర్తించలేదు దుయ్యబట్టారు. మొన్న టీడీపీ 95 స్థానాలు ప్రకటిస్తే సామాజిక న్యాయం ఎక్కడ పాటించిందని వారు ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 21 సీట్లు, 50-60 శాతం ఉన్న బీసీలకు 18 స్థానాలు కేటాయించిందని.. ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్మోహన్ ల మధ్య నక్కకూ నాగలోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీలంటే ఎక్కువ అభిమానం చూపిస్తారని.. అందుకే నిధుల కేటాయింపులో చూసినా, రాజకీయంగా ప్రోత్సహించడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ.. దేనిలో చూసినా జగన్మోహన్ రెడ్డిదే పై చేయి అన్నారు. అటువంటి మనసున్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలకాలం గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైనా ఉందని బీసీ నాయకులు పిలుపునిచ్చారు.
బీసీలకు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గొప్ప సాహసం చేస్తున్నారని.. అది మన ఐక్యతపై జగనన్నకు ఉన్న నమ్మకమని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టాల్సిన బాధ్యత బీసీలు అందరిపైనా ఉందన్నారు. అవకాశాలిచ్చే నాయకులను గుర్తించి గౌరవించాలని, జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శెట్టిబలిజ, గౌడ సామాజిక వర్గీయులకు సభలో వక్తలు పిలుపునిచ్చారు. తెలుగుజాతి ఆత్మ గౌరవం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి దివంగత ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా పోరాడితే.. ఈనాడు తమ రాజకీయ స్వలాభం కోసం అదే టీడీపీ ఢిల్లీ పెద్దలకు తమ ఆత్మాభిమాన్ని తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి అర్బన్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ రామ్, రూరల్ నుండి పోటీచేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత శెట్టిబలిజ, గౌడ తదితర బహుజనులు అందరిపైనా ఉందని ఈ ఆత్మీయ సమ్మేళనం తీర్మానించింది.