మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో చాలా తమాషా నడుస్తోందని.. తనకు, ధర్మాన కృష్ణదాస్‌కు పడదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఆయన గెలిచిన నరసన్నపేట తనకు ఇచ్చి శ్రీకాకుళం స్థానానికి వెళ్లాడని.. ప్రసాదరావు తమ కుటుంబానికి గౌరవం తెచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. అసలు తామిద్దరం ఎందుకు గొడవలు పడాలని ప్రశ్నించారు. పనికిమాలిన యదవలు మాట్లాడుతున్న మాటలు పట్టించుకోవద్దని మీడియాను కోరారు. తన తమ్ముడి కోసం అవసరమైతే తన ప్రాణం కూడా ఇస్తానని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో తాను గెలిచిన సీటు తన కుటుంబంలోని వేరే వ్యక్తికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని.. కానీ తన తమ్ముడు ప్రసాదరావు ఆ పనిచేశాడని కొనియాడారు.
అటు జిల్లాలో 8 స్థానాల్లోనూ గెలిచేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. అనేకమంది సమర్ధవంతమైన నేతలు తమ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. తనకు అనుకోకుండా డిప్యూటీ సీఎం పదవి వచ్చిందని.. జగన్ బలవంతం వల్లే తాను ఆ పదవి తీసుకున్నానని తెలిపారు. తనకు పదవులపై ఆశలు లేవని.. పదవి లేకపోతే ఊర్లో ఆవులు, గేదెలు కడుక్కుంటూ వ్యవసాయం చేసుకుంటానని కామెంట్ చేశారు. అసత్య ప్రచారానికి పార్టీ కేడర్ అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రసాదరావు ఏం చెప్పినా చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతిపక్షాలు వారిలో వారే తన్నుకు చస్తున్నాయని.. ఆత్మకూరులో బీజేపీకి జనసేన, టీడీపీ సహాయం చేసినా డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు బలంగా లేవని ఇట్టే అర్ధం అవుతుందన్నారు. చంద్రబాబుకు మత్రి భ్రమించిందని.. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గాలేదన్నారు.