నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,332 ఓట్లు పడ్డాయి. అయితే ఆత్మకూరు ఉపఎన్నికలో నైతిక విజయం తమదేనని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వీరోచిత పోరాటం చేసిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లతో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని, దీంతో భయపడి 40 శాతం మంది ప్రజలు ఓటు వేయలేదని సోము వీర్రాజు ఆరోపించారు. తమకు ఓటు వేయకపోతే పథకాలు రావని వాలంటీర్ల చేత వైసీపీ నేతలు ప్రచారం చేయించారని విమర్శించారు. దీంతో చాలామంది ప్రజలు వైసీపీకి ఓటు వేశారని తెలిపారు. ఇప్పటికైనా అమరావతిలో భూములను ప్రభుత్వం రైతులకు తిరిగి అప్పగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్…మంత్రులతో సమావేశమై ఎన్నికల్లో మెజారిటీపై సూచనలిచ్చారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మకూరులో తిష్టవేసినా వాళ్లకు ఆశించిన మెజారిటీ రాలేదని ఎద్దేవా చేశారు. వాలంటీర్లు, ఆశ వర్కర్లతో డబ్బులు పంచారని విమర్శలు చేశారు. ఆత్మకూరులో ముమ్మాటికీ నైతికంగా విజయం తమదే అని భరత్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.