ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ అంటోందని.. అంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్లకు వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీలో ప్రజాకర్షణ ఉన్న ఏకైక నేత జగన్ అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్న నాయకుడు జగన్ అని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు ఆయన వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాగా గతంలో కూడా ధర్మాన కృష్ణదాస్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తన ఆస్తులు మొత్తం రాసిస్తానని.. టీడీపీ వాళ్లు ఈ సవాల్‌కు సిద్ధమా అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లకు గెలుస్తామని నమ్మకం ఉంటే.. బెట్ కట్టాలని ఛాలెంజ్ చేశారు. అయితే ఆస్తి మొత్తం రాసిస్తామన్న ధర్మాన సవాల్‌పై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు.