CPI Ramakrishna: ఈనెల 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతిలో బుధవారం నాడు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. ఏపీని మోదీ అన్ని విధాలుగా మోసం చేసి సిగ్గు లేకుండా వస్తున్నారని.. ఒక్క అంశంలోనైనా మోదీ ప్రభుత్వం న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కూడా అధికార యంత్రాంగాన్ని మోదీ పర్యటనకు వినియోగిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. వేల కోట్లతో ప్లీనరీ సమావేశం తరహాలో ప్రచారం చేస్తున్నారని.. ప్రత్యేక హోదా లేదు.. పోలవరం పూర్తి కాలేదని.. విభజన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు.
అటు ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోదీలు మెడలు వంచుతానన్న జగన్.. ఇప్పుడు మోదీ ముందు తల వంచుతూనే ఉన్నాడని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. ప్రధాని మోదీ పర్యటనను బీజేపీ తమ కార్యక్రమంగా చెప్పుకుంటే.. విజయసాయిరెడ్డి బీజేపీ నేతల కన్నా అత్యుత్సాహంతో ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంటే వైసీపీ నేతలకు మోదీ అంటే భయమా లేదా కేసుల నుంచి బయట పడేందుకా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం వద్దని తాము పోరాటాలు చేస్తున్నామని.. స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని ప్రధాని మోదీ చెప్పాకే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటన జరిగే రెండు రోజులు తమ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా నల్లజెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
Read Also: New rule for TV channels: టీవీ ఛానెళ్లకు కొత్త రూల్.. ఇకపై ప్రతీరోజూ 30 నిమిషాలు ఇవి తప్పనిసరి..
ప్రజలకు ద్రోహం చేసిన వారికే ప్రజల సొమ్ముతో పెద్ద పీట వేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏపీకి అన్యాయం చేసిన వారికి సన్మానాలా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని.. లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తారా అని నిలదీశారు. మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ తీర్మానం చేశారని.. ఇప్పుడు ఏమీ చేయకుండానే సాగిలపడి స్వాగతం పలుకుతారా అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ తరహాలో వైసీపీకి కూడా ప్రజా వ్యతిరేకత తప్పదని శ్రీనివాసరావు హెచ్చరించారు. సభలకు అనుమతిచ్చి మళ్లీ నోటీసులు ఇవ్వడం ఏంటన్నారు. రాష్ట్రంలో నిరసనకు తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రతిపక్ష పార్టీలు చూస్తూ కూర్చుంటాయా అని అడిగారు. ఏపీ ప్రభుత్వం కూడా మోదీని నిలదీయాలన్నారు. రాష్ట్రానికి మేలు చేసేలా హామీల అమలుకు డిమాండ్ చేయాలన్నారు. ఈనెల 11, 12 తేదీలలో వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.