30 mins of ‘national interest’ content daily made mandatory for TV channels: టెలివిజన్ ఛానెళ్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో ఈ కొత్త నియమాలను పేర్కొంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే క్రీడలు, వన్యప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ రూల్స్ వర్తించవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: T20 World Cup: పాకిస్థాన్ పిలుస్తోంది.. 1992 సెంటిమెంటా? 2007 సెంటిమెంటా?
త్వరలోనే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. అన్ని ఛానెళ్లు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు జాతీయాసక్తి ఉన్న కంటెంట్ ను ప్రసారం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలైన విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత, రక్షణ మొదలైన అంశాల మీద కంటెంట్ ప్రసారం చేయాల్సి ఉంటుంది.
కనీసం 30 నిమిషాల పాటు వీటిని ప్రసారం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇండియాలో ఛానెల్ అప్ లింగ్, డౌన్ లింక్ చేయడానికి అనుమతి ఉన్న అన్ని కంపెనీలు కూడా జాతీయాసక్తి ఉన్న సామాజిక అంశాలపై ఒకరోజులో కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.
స్పోర్ట్స్ ఛానెళ్ల విషయంలో ఇలాంటివి సాధ్యపడిని చోట మినహా అన్ని ఛానెళ్లలో నేషనల్ ఇంట్రెస్ట్ కంటెంట్ ప్రసారం చేయాలని పేర్కొంది. ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు సలహాలను జారీ చేయవచ్చని.. ఛానెళ్లు దానికి అనుగుణంగా ప్రసారం చేయాలని పేర్కొంది.