గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు గుడివాడ ఘటనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుడివాడలో ఎలాంటి క్యాసినో జరగలేదని, విపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినో వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
క్యాసినో ఎక్కడ జరిగినా జరిగింది వాస్తవమా కాదా? విష సంస్కృతి ప్రోత్సహించినట్లా కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా గత నాలుగైదు రోజులుగా ఏపీలో క్యాసినో రచ్చ కొనసాగుతున్నా డీజీపీ తీసుకున్న చర్యలేంటని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రిపై ఉన్న క్యాసినో అభియోగాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని, క్యాసినో నిర్వహించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.