ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేయలేదని ఆయన గుర్తుచేశారు. వైయస్, చంద్రబాబు కూడా అభ్యర్థులను నిలపలేదన్నారు. జగన్ అభ్యర్థులను నిలపడమే కాకుండా అక్రమ మార్గాల్లో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చారని చెప్పారు. 15 వేల ఓట్లు తిరుపతిలోనే ఎక్కించారని తెలిపారు. ఎక్కడ దొంగ ఓట్లు వేసినా వారిని పాట్టిస్తామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో వెండి బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఓటుకు 5 నుంచి 10వే లు ఇస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు.. ఓటుకు మాత్రం డబ్బు ఇస్తారని ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలను జగన్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలసి పని చేస్తున్నామన్నారు. పరస్పరం ఓటు బదిలీ జరిగేలా చూస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి రిహార్సల్స్ అని అందుకే జగన్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈసారి వైసీపీ గెలిస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి మెడకు వారే ఉరి వేసుకున్నట్టే అని వ్యాఖ్యానించారు.
Also Read:MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. ఈసీకి చంద్రబాబు లేఖ
కాగా, రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (ఉత్తరాంధ్ర), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో ఏకంగా 37 మంది ఉన్నారు. టీడీపీ మద్దతులో వేపాడ చిరంజీవిరావు, వైస్సార్సీపీ మద్దతుతో సీతంరాజు సుధాకర్, బీజేపీ తరపున సిటింగ్ అభ్యర్థి పీవీఎన్ మాధవ్, వామ పక్షాల అభ్యర్థిగా కె.రమాప్రభ పోటీ చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులంతా ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు.