వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరుఫున వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనమే అయినా పోటీ మాత్రం తప్పదని తెలుస్తోంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని బీజేపీ, కాంగ్రెస్ లు పోటీకి దిగుతుండటంతో ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది.
బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. బద్వేల్ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య తన సమీప టీడీపీ అభ్యర్థిపై 44వేల ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ దాదాపు యాభై వేలకు పైగా ఓట్లను సాధించింది. మిగతా పార్టీలన్నీ కూడా నోటా గుర్తుతో పోటీపడ్డాయి. ఇక త్వరలో జరిగబోయే ఉప ఎన్నికలోనూ వైసీపీ గెలుపు ఖాయంగా కన్పిస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. అలాగే సానుభూతి పవనాలు కూడా వైసీపీ అభ్యర్థికి కలిసి రానున్నాయి.
దీంతో డాక్టర్ సుధ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుంది. గతంలో కంటే ఈసారి మెజార్టీ మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే జనసేన, టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఉప ఎన్నిక కొంత చప్పగా సాగే అవకాశం కన్పిస్తుంది. బలమైన పార్టీలు పోటీ నుంచి తప్పుకోగా బలహీనమైన పార్టీలు పోటీకి దిగుతుండటంతో గెలిచేదెవరో ముందుగానే తెల్సిపోతుంది. ఇదే సమయంలో టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీ వైపు మరలుతుందనే చర్చ కడప జిల్లాలో జోరుగా సాగుతోంది.
కడప జిల్లాలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీ మాత్రమే ఉంది. మిగతా పార్టీలేవీ కనీస పోటీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి చెప్పుకోదగిన ఓట్లను సాధించి రెండో ప్లేస్ దక్కించుకున్నారు. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆపార్టీ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కన్నేశాయి. అయితే టీడీపీ కార్యకర్తలు తమ ఓటును ఎవరికీ బదిలీ చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు ఇక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ వైపే టీడీపీ మొగ్గే అవకాశాలు ఎక్కువగా ఉందనే టాక్ విన్పిస్తుంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో టీడీపీకి చెందిన ఓటర్లు ఈ ఎన్నికలో బీజేపీ కంటే కాంగ్రెస్ వైపే ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి. టీడీపీపై ఒంటికాలిపై లేచే సోమువీర్రాజును ఈ ఎన్నికల్లో దెబ్బతీయడం ద్వారా అతడి నాయకత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం టీడీపీకి దక్కనుంది. దీంతో ఈ ఎన్నికను చంద్రబాబు బీజేపీని దెబ్బతీసేలా వినియోగించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తానికి టీడీపీ ఓటు బ్యాంక్ మాత్రం బీజేపీ కంటే కాంగ్రెస్ వైపే మరలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.