నేడు గుంటూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించనున్నారు జగన్. అనంతరం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ చేస్తారు సీఎం జగన్. ఇస్కాన్ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మాణం జరగనుంది.
ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది చేసేలా ఇస్కాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొలనుకొండలో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి కేటాయించిన సీఎంకు హరేకృష్ణ మూవ్‌మెంట్ ఇండియా రాష్ట్ర ఏడీఎం సత్యగౌరచంద్రదాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ మధుపండిట్‌దాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.