2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్‌నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రెండేళ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయని, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు. వరదలతో కొన్ని ప్రాంతాల్లోని పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో రైతన్నలకు నష్టపరిహారం అందించిన తొలి రాష్ట్రామనదేనని ఆయన అన్నారు. 2014 ఖరీఫ్ సీజన్‌లో చోటుచేసుకున్న కరువుకు 2015 నవంబర్‌లో వరకు కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. అలాగే 2015 లో చోటు చేసుకున్న కరువుకు కూడా 2016 నవంబర్ వరకు ఇచ్చిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.