Srikalahasti: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక, కాళహస్తీ ఆలయంలో 50 రూపాయల టికెట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం.. 200 రూపాయల వీఐపీ టికెట్టు ధరను రూ. 250కి పెంచామన్నారు. స్వామి అమ్మవారి అంతరాలయ దర్శనం టిక్కెట్టు ధర 500 రూపాయలకు పెంచినట్లు చెప్పుకొచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తామని మంత్రి అనిత పేర్కొన్నారు.
Read Also: Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై ఉన్నత స్థాయి కమిటీ..
ఇక, మహిళలకు పసుపు కుంకుమ గాజులు రవిక అమ్మవారి ప్రసాదంగా ఇస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఉత్సవాల్లో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, మజ్జిగ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు 11 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాం.. ప్రతి పార్కింగ్ పాయింట్ లో అంబులెన్స్ ఉంటుంది.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాల ద్వారా పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుంది.. వీఐపీలకు ప్రత్యేక టైం స్లాట్ ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తామని వంగలపూడి అనిత చెప్పారు.