చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రూ. 1.35 కోట్లతో అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తున్నారని, వారం రోజులు పాఠశాలల్లో భోజనాలు ఏం పెట్టాలో కూడా సీఎం గారు నిర్ణయించారని ఆయన వెల్లడించారు. వైద్య, విద్యకు ప్రాధాన్యం ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పోటీ తత్వం తట్టుకోవాలంటే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అవసరం అని సీఎం గుర్తించారని, పథకాలు పేరుతో డబ్బులు ఇచ్చేస్తున్నారు అని విమర్శించే వారికి పాఠశాల అభివృద్ధి, ఆసుపత్రుల నిర్మాణం కనపడలేదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, నాబార్డ్ నిధుల రూ.8700 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా.. వారికి కనిపించదు అంటూ ఆయన మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గంలో మొదటి విడతలో 33.79 కోట్ల రూపాయలతో 125 పాటశాలలు అభివృద్ధి చేశామని, ఇప్పుడు రెండో విడతలో 28.91 కోట్లతో 109 పాటశాల లు అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.