Chandra Babu: కడప జిల్లా కమలాపురంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ తరహాలో తాను ఒక రాష్ట్రం ముఖ్యమని.. అధికారం ముఖ్యమని చెప్పను అని.. తనకు తెలుగు జాతి ముఖ్యమని.. తెలుగు ప్రజలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విశాఖను ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆకాంక్షించారు.
Read Also: Jackpot : జగిత్యాల యువకుడికి 30 కోట్ల జాక్‌పాట్..
రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అయినా జీతాలు ఇవ్వలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని చురకలు అంటించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతుంటే పట్టించుకోని సీఎం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసగించారని మండిపడ్డారు. అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు ఆనందంగా లేరని.. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని, రాష్ట్రంలో రైతులు పూర్తిగా చితికిపోయారని చంద్రబాబు విమర్శలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచామని, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు గుర్తుచేశారు.