ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. సీఎం జగన్ వినుతల పైన ప్రధాని ఈ సారి వేగంగా స్పందించి, సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. సుదీర్ఘ కాలంగా ఏపీకి దక్కాల్సిన బకాయిల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ డిస్కమ్ ల నుంచి ఏపీకి బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.. ఇదే అంశం పైన గతంలో పలు మార్లు కేంద్రానికి ఏపీ నివేదించినా, అయినా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు.
ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ సమయంలో చర్చించిన అంశాల పైన ఈ సారి వెంటనే స్పందించింది పీఎంఓ, ఏపీకి సంబంధించిన అంశాల పైన అధికారుల కమిటీకి బాధ్యతలు అప్పగించటంతో పాటు, తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఈ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం 30 రోజుల సమయం కేటాయించింది. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. దీంతో.. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు ఉండిపోయాయి. అయితే.. నీతి అయోగ్ సమావేశం, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాలతో పాటుగా ప్రధానితో సీఎం సమావేశమైన అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి, పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు.
ఈనేపథ్యంలో.. ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ సూచించారు. దీంతో.. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే.. చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ వాదిస్తోంది. దీంతో.. ఈ నెల 22న సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర ఇంధన శాఖ మంత్రితో సమావేశమైన ఆయన ఈ విషయం పైన పట్టుబట్టారు. దీంతో.. కేంద్రం నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో.. ఇప్పుడు ఈ ఆదేశాల పైన తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Lift Fight : సాయానికి పోతే పాపం ఎదురైందంట.. ఇదే మరీ..!