వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే, భూయజమానులకు యాజమాన్య హక్కు కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చించింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కుతో కూడిన కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి వెయ్యి గ్రామాల్లో ఓనర్ షిప్ సర్టిఫికేట్ల జారీకి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, ఆర్ఓఆర్ చట్టాలకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని 51 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి…. డ్రోన్లు, రోవర్లు, కోర్ సబ్ స్టేషన్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 70 కోర్ సర్వే సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు తాడేపల్లి గూడెంలో పైలెట్ ప్రాజెక్ట్ గా, అర్బన్ లోనూ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలో సర్వే ప్రక్రియ ద్వారా ఎస్ఓపిలను రూపొందించి, రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు. అలాగే ప్రస్తుతం 206 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతోంది, 71 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.