GVL Narasimha Rao: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్‌ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్‌గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్‌కు ఎందుకు అని నిలదీశారు. కేసీఆర్ వైసీపీని నడిపిస్తున్నారా లేదా ఆ పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని సూటి ప్రశ్న వేశారు.
Read Also: Password: మన దేశంలో ఎక్కువ మంది వాడుతున్న పాస్‌వర్డ్ ఏంటో తెలుసా?
తన పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలని కేసీఆర్ మీడియా కవరేజ్ కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ద్వారా ప్రచారం పొందాలని చూస్తే విశ్వసనీయతకు భంగం వాటిల్లడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు మానుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణలో జరిగిందే అవాస్తవమని.. ఆ విషయాన్ని తమ నాయకత్వం గట్టిగా చెప్పిందన్నారు. 2024లో భారతీయ జనతాపార్టీ, జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా మారతామన్నారు. ఎన్నికల ముందు తమ పార్టీలోకి విస్తృతంగా చేరికలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరికలను ప్రోత్సహిస్తామన్నారు. వైసీపీని అస్థిరపరుస్తున్నామనేది కేసీఆర్ కల్పించుకున్న కొత్త స్క్రిప్ట్ అని.. కథ, నిర్మాత అంతా కేసీఆరే అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.