GVL Narasimha Rao: రాష్ట్ర విభజన అంశంపై మరోసారి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. రాష్ట్ర విభజనపై ఏపీలో విచిత్ర చర్చ జరుగుతోందని.. గతంలో వైసీపీ కూడా విభజనకు లేఖ ఇచ్చిందని జీవీఎల్ గుర్తుచేశారు. అప్పుడు అలా చేసి.. ఇప్పుడు విభజనను వ్యతిరేకించామని వైసీపీ కొత్త కహానీలు చెబుతోందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు కలవాలనే నినాదం తీసుకురావడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే.. 175 స్థానాలు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించవచ్చని వైసీపీ కోరుకుంటోందా అని జీవీఎల్ ప్రశ్నించారు.
రాష్ట్ర విభజనపై సజ్జల కామెంట్లపైనా బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఉమ్మడి ఏపీ ఏర్పడుతోందనే అనుమానాలు తెలంగాణలో రేకెత్తించే ఉద్దేశ్యంతోనే సజ్జల కామెంట్లు చేశారనే భావిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. కానీ తెలుగు రాష్ట్రాల మధ్యనున్న సమస్యల పరిష్కారానికి సీఎంల మధ్య స్నేహం అక్కరకు రావడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సఖ్యత రాజకీయ సమస్యల పరిష్కారానికి మాత్రమే ఉపయోగపడుతున్నట్టే కన్పిస్తోందన్నారు.
Read Also: Rajini Film Festival : డిసెంబర్ 9 నుంచి 15 వరకు చెన్నై, కోయంబత్తూరులో రజనీ ఫిల్మ్ ఫెస్టివల్
కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందనే అంశాన్ని ఛార్జ్ షీట్లో పెడతామని జీవీఎల్ అన్నారు. ఐటీ రంగాన్ని విభజన తర్వాత నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. విశాఖను ఐటీ హబ్ చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని.. కొన్ని సంస్థలు ముందుకొస్తున్నా ఏపీ ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల వెనక్కు వెళ్లిపోతున్నాయని జీవీఎల్ విమర్శలు చేశారు. కేంద్రం ఇచ్చిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. తమకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులనే వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు అనుమతించాయని ఎద్దేవా చేశారు.
ఇటీవల గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 404 సీట్లే బీజేపీ టార్గెట్ అని.. బీజేపీ అధినాయకత్వం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అపార నమ్మకం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ అంటే భయం పట్టుకుందని.. కొన్ని పార్టీలు పేరు మార్చుకుని.. జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా జీవీఎల్ విమర్శలు చేశారు.