Gottipati Ravi Kumar: గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. బాపట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని ఫైర్ అయ్యారు.. ఇక, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో పుష్కలంగా వరద నీరు చేరడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుందని తెలిపారు.. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా అందిస్తామని స్పష్టం చేశారు.. దేశంలోనే విద్యుత్ రంగంలో మొదటగా సంస్కరణలు తీసుకువచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని గుర్తుచేశారు.. మరోవైపు.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సంస్థను గాడిలో పెట్టి దేశానికే ఆదర్శవంతమవుతాం అన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
Read Also: Tollywood: ‘సూపర్ సిక్స్’ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ
కాగా, శ్రీశైలం హైడెల్ పవర్ ప్రాజెక్టు ద్వారా డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఈ మధ్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేసిన విషయం విదితమే.. శ్రీశైలం డ్యామ్ వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పాల్గొన్న మంత్రి గొట్టిపాటి.. అనంతరం కుడి హైడెల్ పవర్ కేంద్రాన్ని సందర్శించి జెన్‌కో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.. అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని సూచించిన విషయం తెలిసిందే.. మరోవైపు.. విద్యుత్‌శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన విషయం విదితమే.