Balineni Srinivasa Reddy: నెల్లూరు జిల్లా పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. తాజాగా, నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు కోటంరెడ్డి.. అయితే, కోటంరెడ్డికి కౌంటర్ ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనుకున్న వాళ్లే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. కోటంరెడ్డిని బతిమాడాల్సిన అవసరం మాకులేదన్న ఆయన.. మాకు ఎందరో నాయకులు వున్నారు.. టీడీపీ నుంచి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.. కానీ, మా దగ్గర ఖాళీలు లేవన్నారు.
Read Also: Minister Jogi Ramesh: సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం?..
ఇక, మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్లు వున్నారు.. అందరికీ అవకాశం రాదు.. ఒక్కరికే వస్తుందన్నారు మాజీ మంత్రి బాలినేని.. నన్ను మంత్రిగా కొనసాగించలేదు.. కానీ, పదవులు ముఖ్యం కాదు.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.. ముందుగా టీడీపీ నాయకులతో మాట్లాడుకుని ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని.. అసలు ఈ విషయాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదని డిమాండ్ చేశారు. అసలు వాళ్లు మాట్లాడుకున్నది రికార్డు చేసి.. వారే బయటపెట్టి అది ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని ఆరోపించారు.. మరోవైపు నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఇంఛార్జి్‌ని నియమిస్తాం.. ఎన్నికల తర్వాత శ్రీధర్ రెడ్డి బాధపడతారని వ్యాఖ్యానించారు.. వెంకటగిరిలో కూడా ఇంచార్జిని నియమిస్తాం అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ చేస్తామని వెల్లడించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.