ఓవైపు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తుండగా, మరోవైపు 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చంద్రబాబు A1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా స్పందించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు, ఇంకా అలైన్మెంట్ మార్పు ఎక్కడినుంచి వస్తుంది? అంటూ ప్రశ్నించారు. రోడ్డేసినట్టు, అలాగే దాని వల్ల చంద్రబాబు మనుషులకు ఏదో లబ్ది చేకూరినట్టు వైసీపీ ప్రభుత్వం భ్రమలు కల్పిస్తోందని ఆరోపించారు.
అప్రూవ్ కాని అలైన్మెంటుకు, వేయని రోడ్డు విషయంలో ఏవేవో తప్పిదాలు జరిగాయంటూ కేసులు పెట్టడం నవ్వు తెప్పిస్తోందని అచ్చెన్నాయుడు సెటైర్ వేశారు. జగన్ ఇంటి పెంపుడు మనిషితో ఇలా తప్పుడు ఫిర్యాదు చేయించడం, కేసులు పెట్టడమేనా ప్రభుత్వం చేయాల్సిన పని? అంటూ నిలదీశారు. చంద్రబాబు జిల్లాల పర్యటనకు వస్తున్న స్పందనతో వైసీపీలో వణుకు మొదలైందని, వైసీపీ నేతలు ఎక్కడికెళ్లినా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని స్వయంగా హైకోర్టే స్పష్టం చేశాక, మరో కేసు పెట్టడమేంటో అర్థం కావడం లేదన్నారు.
ఇక నారాయణ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలో ఆయన్ను ఏ ఆధారంతో అరెస్టు చేశారో డీజీపీ సమాధానం చెప్పాలని అడిగారు. చిత్తూరులో ఎస్పీ ప్రెస్‌మీట్ చూసిన తర్వాత, వైసీపీ చేతుల్లో పోలీసులు కీలు బొమ్మల్లా మారారని స్పష్టమైందన్నారు. పేపర్ లీక్ చేసినందుకు 45 మంది టీచర్స్‌ని సస్పెండ్ చేశారు, ఈ వ్యవహారంలో ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అని ప్రశ్నించారు. కడపలో సీబీఐ డ్రైవరుని బెదిరించడం డీజీపీకి కనిపించలేదా? అని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.