Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సోమవారం నాడు అన్ని జిల్లాల కేంద్రాల్లో టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వెల్లడిచారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫించనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. దాచుకున్న డబ్బును కూడా తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు చేయకుండా పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎన్ని అటంకాలు సృష్టించినా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. దారుణంగా పడిపోయిన సగటు
ప్రస్తుతం ఏపీలో ఉపాధ్యాయులు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.20 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 26న తాము అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.1700 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి ఉందని వివరించారు. 13 జిల్లాలకు సంబంధించి ఈ నిరసనలలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు మాత్రమే పాల్గొంటారని.. పోలీసులు వేధింపులకు గురిచేయడం సరికాదని.. తాము శాంతియుతంగానే ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ రద్దు, టీచర్ల బదిలీలలో అవకతవకలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.