ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన పొలిటికల్ కామెంట్లు చేయడం ఏంటి? విమర్శలు చేయడం ఎందుకు? స్పీకర్‌గా ఉండి ఇలా చేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, తనను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. స్పీకర్ మాట్లాడటమేంటి అంటున్నారు.. ప్రజలు ఓటేసి నన్ను గెలిపించారు.. వారి కోసం మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెప్పడం కూడా రాజకీయమేనా? అని మండిపడ్డ ఆయన.. నాగొంతులో ప్రాణం ఉన్నంత వరకూ నా ప్రాథమిక కర్తవ్యాన్ని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా… ఐ డోంట్ కేర్ అన్నారు స్పీకర్ తమ్మినేని. తాను అసెంబ్లీకి స్పీకర్ నే కావొచ్చు.. కానీ, నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అన్నారు. స్పీకర్‌గా నన్ను ఇంట్లో కూర్చోమంటారా..? చెప్పండి కూర్చుంటానన్న ఆయన.. మొన్న కరోనా టైమ్‌లో రెండు సార్లు ఇబ్బంది పడ్డాను… బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది.. కానీ, బ్రహ్మదేవుడు నాకింకా టైమ్ ఉందని వెనక్కి పంపించేశాడు వ్యాఖ్యానించారు.
మరోవైపు.. నారాయణ, చైతన్య విద్యాసంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని.. శ్రీచైతన్య, నారాయణ అంటూ తల్లిదండ్రులు ఎందుకు పరుగులు తీస్తున్నారు..? ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారికెవరికీ పూర్తిస్థాయి క్వాలిఫికేషన్ లేదన్నారు.. అక్కడంతా ఏ.బీ.సీ.డీ.ఎఫ్. అని బట్టీ పట్టించడమే తెలుసని వ్యాఖ్యానించిన ఆయన.. పిల్లల మెదడును మానుప్లేట్ చేస్తారు అని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మంచి ట్రైనింగ్ కలిగిన వారు అని వెల్లడించిన ఆయన. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు నా సవాల్.. కింతలిలోని జెడ్పీహెచ్ స్కూల్లోని టీచర్లతో పోటీకి రావాలంటూ ఛాలెంజ్ చేశారు.