AP Government Green Signal For 5 Days Assembly Sessions: స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాల్లో బాగంగా ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా.. ఈ సమావేశంలో హాజరైన అచ్చెన్నాయుడికి తాము ఏ అంశంపై అయినా చర్చకు రెడీ అని సీఎం జగన్ చెప్పారు. ఈఎస్సై స్కామ్‌తో పాటు రాజధాని అంశంపై చర్చకు కూడా తాము సిద్ధమేనన్నారు. అయితే.. సభ నిర్వహణను మాత్రం అడ్డుకోవద్దని జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఈ బీఏసీ సమావేశాల అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. 5 రోజుల పాటు సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు, రేపు, 19, 20, 21వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయన్నారు. టీడీపీ ప్రతిపాదించిన 19 అంశాలతో పాటు వైసీపీ ప్రతిపాదించిన 29 అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. ప్రతిపక్షం ఏ అంశం మీద చర్చకు కోరినా తాము సిద్ధమని.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తాము రెడీ అని పేర్కొన్నారు. సభ జరగకుండా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. ఈరోజు కూడా సభ మొదలు కాగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. సభను అడ్డుకోవద్దని ప్రతిపక్ష పార్టీ నేతలను సభలోనూ, బీఏసీలో స్పీకర్ కోరారన్నారు.
చంద్రబాబు గత ఐదేళ్లలో ఘోరంగా విఫలమయ్యారని, తమని అడగడానికి ప్రతిపక్షాలకు అంశాలేవీ లేని పరిస్థితి నెలకొందని ముదునూరి ప్రసాదరావు అన్నారు. అందుకే ధైర్యంగా ఏ విషయంపైనా చర్చకు వచ్చే పరిస్థితి ప్రతిపక్షానికి లేదన్నారు. ఎలాగైనా వేటు వేయించుకుని, సభలో నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో టీడీపీ ఉందన్నారు. సభను సజావుగా కొనసాగేలా చూడాలని తాము పదే పదే కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.