దేశంలో ఎక్కడైనా సరే.. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి ఆఫీసుకి రారు అనే అపవాదు నెలకొని ఉంది. అయితే ఉద్యోగులు సమయానికి రావాలి.. విధులు సక్రమంగా నిర్వహించాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. ఉద్యోగులతో సరిగ్గా పనిచేయించుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వ బాధ్యతే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఉద్యోగులు సమయానికి ఆఫీసుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
రాష్ట్రంలోని సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ సమయానికి కార్యాలయానకి రాకపోతే సెలవు కింద పరిగణించి శాలరీ కట్ చేస్తామని ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉదయం 10:10 గంటలకు ముందే ఆఫీసుకు రావాలని.. సాయంత్రం 5:30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఉదయం 10:10 గంటల నుంచి 11 గంటల వరకు హాజరయ్యేందుకు నెలలో మూడు సార్లు మాత్రమే అవకాశం ఇస్తామని తెలిపింది.