కడప జిల్లాకు నేను ఎంత చేసినా తక్కువే… జిల్లాకు ఏమి ఇచ్చినా ప్రజల రుణం తీర్చుకోలేనిది అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్… జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. ఇవాళ కడపలోని మహావీర్ సర్కిల్ లో రూ.459 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనల శిలాఫలకాలను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. కడప నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు గతం కంటే అతి వేగంగా జరుగుతున్నాయన్నారు.. నగరంలోని రోడ్లు ఎంతో అందంగా ముస్తాబయ్యాయని కితాబిచ్చిన జగన్.. దివంగత నేత వైఎస్సార్ మరణించాక జిల్లాను పట్టించుకున్న నాథుడే లేరని విమర్శించారు.. అయితే, గతంలో చేసిన అభివృద్ధి కంటే ప్రస్తుతం వేగంగా చేస్తున్నామని.. అత్యంత ప్రముఖ నగరాల్లో త్వరలో కడప నగరం కూడా చేరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాను కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువే… జిల్లాకు ఏమి ఇచ్చినా ప్రజల రుణం తీర్చుకోలేను.. జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని ఆకాక్షించారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.. 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయనున్నారు.. అనంతరం వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు.