CM Jagan: ఏపీ సీఎం జగన్ నెలరోజుల కిందట కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ఎంతో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ… తాజాగా ఆ బాలిక వైద్యానికి రూ.కోటి మంజూరు చేశారు. ఈ మేరకు అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను అమలాపురం ఏరియా ఆసుపత్రిలో హనీ తల్లిదండ్రులకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటోందని.. బాలిక కుటుంబానికి నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
కాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి బాలిక హనీకి గాకర్స్ వ్యాధి పుట్టుకతోనే వచ్చింది. ఈ వ్యాధివల్ల కాలేయం పనిచేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం జగన్ పర్యటించారు. తిరుగు ప్రయాణంలో సీఎం ఉండగా, హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు . తన వెంట హెలిప్యాడ్ వద్దకు తీసుకురావాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం క్షుణ్నంగా మాట్లాడి హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆదేశించారు. కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరుచేసింది. హనీ వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరుచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్ వెల్లడించారు.
Read Also:Pawan Kalyan: పవన్ ధరించిన వాచీ విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
హనీకి ఉన్న గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని, ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా, కంపెనీ సంప్రదింపులు జరిపి వీటిని తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్‌ను క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు. అలాగే పాప భవిష్యత్తు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముఖ్యమంత్రి స్పందించి ఉదారంగా సహకారం అందించారని కలెక్టర్ తెలిపారు. పింఛన్ ఇప్పించేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వైద్యం అందించడం అందించలేదని తొలుతగా స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ తరహా వ్యాధి నివారణ చర్యలు ఆరంభమయ్యాయన్నారు. ముఖ్యమంత్రిని కలవగానే ఎంతో ఉదారంగా స్పందించి ఎంత ఖర్చయినా పర్వాలేదు నేను ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా కల్పించారని పాప తండ్రి కొప్పాడ రాంబాబు తెలిపాడు. సీఎం భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అటు చిన్నారి తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని అండగా నిలవడంతో చిన్నారి హనీ భవిష్యత్‌పై ఆశలు చిగురుస్తున్నాయని తెలిపారు.