ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 67,935 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
ఏపీలో అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉండగా… విజయనగరం జిల్లా చివరిస్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 43,45,322 మంది ఓటర్లు ఉండగా… ఇందులో 21,47,696 మంది పురుషులు, 21,97,274 మంది మహిళలు, 352 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 19,02,077 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 9,38,743 మంది పురుషులు, 9,63,197 మంది మహిళలు, 137 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు.
అటు ఎక్కువ ఓటర్ల జిల్లాల జాబితాలో తూర్పుగోదావరి తర్వాత గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాలలోనూ పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఏపీలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 17,343 మంది, ప్రకాశం జిల్లాలో 8,268 మంది, విశాఖలో 7,897 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ సర్వీస్ ఓటర్లు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కేవలం 721 మంది సర్వీస్ ఓటర్లు మాత్రమే ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది.