NTR University: ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు వైసీపీ సర్కారు చేసిన తీర్మానానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీకి సభలో ఉన్న బలం ఆధారంగా సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ చట్టానికి ఆమోదం తెలపాలంటూ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంపై పరిశీలన చేసిన గవర్నర్… సోమవారం ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు.
Read Also: Joe Biden: భారతీయులకు అండగా ఉంటాం.. మోర్బీ వంతెన ఘటనపై బైడెన్ సంతాపం
కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం లభించడంతో ఈ బిల్లును చట్టంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు అధికారికంగా వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారిపోయింది. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు అంశం ఇటీవల ఏపీలో అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు ససేమిరా ఒప్పుకోలేదు. పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా ఈ అంశంపై స్పందించింది. కానీ సీఎం జగన్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. తన తండ్రి పేరును యూనివర్సిటీకి పెట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ వర్సిటీకి పేరు మార్పుపై హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తటస్థ వైఖరి అవలంభించినట్లు కనిపించింది. ఆయన తీరుపై టీడీపీ నేతలు విమర్శలు కూడా చేశారు.