Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు పచ్చజెండా ఊపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బదిలీల కోసం పలువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అంతరాష్ట్ర బదిలీల కోసం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకు 1338 మంది ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జీఏడీ రాష్ట్ర పునర్విభజన శాఖ ప్రతిపాదిత జాబితాపై సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాను ఏపీ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నారు.
Read Also: YS Sharmila: నా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్
తెలంగాణ ప్రభుత్వం ఆమోదంతో బదిలీల విధి విధానాల ప్రక్రియ రూపకల్పన జరగనుంది. తెలంగాణకు బదిలీ కోరుకునే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌వోసీ ఇవ్వనుంది. ఉపాధ్యాయ బదిలీలలో తప్పనిసరి బదిలీకి ఎనిమిది సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోరగా.. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. కాగా అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.