అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. అందరికీ సమాన హక్కలు ఉండేందుకు అంబేడ్కర్ గొప్పగా కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
దళితుల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రూపొందించిన సబ్ ప్లాన్‌ను జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశాడని ఆయన ఆరోపించారు. గతంలో దళితుల కోసం ఏర్పాటు చేసిన ఏ పథకాలు కూడా ప్రస్తుత జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అమలులో లేవని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బలహీన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని లేదంటే, ప్రజల ఆగ్రహ ఆవేశాలకు జగన్ లోనుకావాల్సిందేనని హెచ్చరించారు.