Adulterated Ghee in Atreyapuram Putharekulu: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకులు తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యితో కొందరు దుకాణదార్లు పూతరేకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది. దాడుల్లో ఎటువంటి బ్రాండ్ లేని 160 కేజీల కల్తీ నెయ్యి సీజ్ చేసి ఎనిమిది షాపులపై కేసులు నమోదు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూతరేకు స్వీట్ లో కొందరు అధిక లాభాల కోసం కల్తీ నెయ్యిని కలుపుతున్నట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు దాల్ నిర్వహించడం సంచలనంగా మారింది..
Read Also: CM Chandrababu: దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు..
ఆత్రేయపురం మండలంలో నకిలీ, కల్తీ నెయ్యి విక్రయాలు, వినియోగంపై.. ప్రజల నుండి వస్తున్న ఆరోపణపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో.. ఫుడ్ షేఫ్టీ కంట్రోల్ అధికారులు రంగంలోకి దిగారు. నాలుగు బృందాలు రంగంలోకి దిగి దాడులు జరిపారు. పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నకిలీ, కల్తీ నెయ్యి జాడలను గుర్తించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. కొందరికి నోటీసులు జారీ చేసారు. నెయ్యి నమూనాలను సేకరించి.. హైదరాబాద్ లోని ప్రత్యేక ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో పూతరేకుల తయారీతో పాటు, పలు షాపుల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏక కాలంలో పూత రేకులు షాపులు, హోల్ సేల్ నెయ్యి షాప్ లలో తనిఖీలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. పలుచోట్ల కల్తీ, నకిలీ గా భావిస్తున్న నెయ్యి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా పలుచోట్ల గుర్తించిన బ్రాండ్ లేని 160 కిలోల నెయ్యి ప్యాకెట్లను సీజ్ చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఆయాచోట్ల సేకరించిన నమూనాలను పరీక్షలు నిమిత్తం తెలంగాణ ప్రాంతంలోని ప్రత్యేక ల్యాబ్ కు తరలించినట్లు తెలిపారు. మూడు చోట్ల నమూనాలు సేకరించిన నేపథ్యంలో.. ఆ మూడు షాపుల పైన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..
అలాగే 15 షాపులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ వినియోగిస్తున్న నెయ్యి కల్తీ నెయ్యి కావచ్చని స్పష్టం చేశారు. ఈ నెయ్యి జంతు కొవ్వుతో తయారుచేసింది కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే.. వీటిల్లో నూనెతో పాటు ఇతర పదార్థాలను కలిపి, లాభాపేక్షతో కల్తీకి పాల్పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.. బ్రాండెడ్ లేని సాదా ప్యాకెట్లలో నెయ్యి విక్రయించడం పరిగణలోకి తీసుకొని.. ప్రస్తుతం నోటీసులు ఇవ్వడం, కేసులు నమోదు చేయడం జరిగింది. పరిశీలన అనంతరం నివేదిక వచ్చాక దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే.. ఇక్కడ ప్రస్తుతం కల్తీ నెయ్యిగా భావిస్తున్న ప్యాకెట్లను వినియోగిస్తున్న వ్యాపారులు మాత్రం అసలు వాళ్లకు ఈ నెయ్యి ఎవరు సరఫరా చేస్తున్నారో చెప్పడం లేదు. ఎవరో వ్యక్తి సైకిల్ పై తెచ్చి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టనున్నారు. అసలు ఈ నకిలీ నెయ్యిని, కల్తీ నెయ్యిని ఎక్కడి నుండి తీసుకువస్తున్నారో.. సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కల్తీ వ్యవహారంపై సమాచారం అందించాలని శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. ఆత్రేయపురం పూతరేకులకు ఉన్న బ్రాండ్ చెడిపోకుండా.. ఈ పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించవద్దని, అందరూ బ్రాండెడ్ నెయ్యిని వినియోగించి ప్రజారోగ్య భద్రతకు సహకరించాలని వీరందరికీ సూచించినట్లు శ్రీనివాస్ తెలిపారు.