ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామం వద్ద గల ఏలూరు కెనాల్ ను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ పనులను అవగాహన లేకుండా చేపట్టారని ఆయన ఆరోపించారు. ముందు చూపు లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం చారిత్రక తప్పిదమని ఆయన మండిపడ్డారు. తప్పు ఎవరి వైపు జరిగిందనే విషయం అన్ని చోట్ల విస్తృత చర్చ జరగాలని ఆయన అన్నారు.
నాకు మాములు వాల్‌కి డయాఫ్రమ్ వాల్‌కి తేడా తెలియదని వ్యంగంగా అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రావీణ్యం కలిగిన వ్యక్తి దేవినేని ఉమా అయితే.. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్నప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వారు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినటానికి కారణం ఎవ్వరు?. కాపర్ డామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ చేపట్టడం తప్పు కాదా? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి లైఫ్ లైన్ లాంటిది పోలవరం అని, దీనికి కారణమైన మిమ్మల్లి ప్రజలు క్షమించరు అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.