High Court Serious on AP Police: ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతుందని.. అసలు పోలీసు వ్యవస్ధ పనిచేసేది ఇలాగేనా అంటూ ఆక్షేపించింది. తిరుపతి పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని నిలదీసింది. నిబద్దత ఉంటే ఐజీ స్ధాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారని పేర్కొంది ఉన్నత న్యాయస్థానం. పరకామణి కేసు విచారణలో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో విఫలం అయ్యారని మండిపడింది. ఆ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి సహకరించారని వ్యాఖ్యానించింది. మీ చర్యలే మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెబుతున్నాయని కోర్టు పేర్కొంది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది.