Holiday For Schools in AP: వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలు నిండుకుండలా మారాయి.. ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు గడ్డలు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్షానికి గవర కంచరపాలెం, ఆనందపురం ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలిపోవడం వల్ల వాహనాలు పలు ధ్వంసం అయ్యాయి.. అల్లూరి జిల్లా ఏజెన్సీలో అత్యధికంగా వై రామవరం 68.4 ముంచంగిపుట్టులో 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం వంచుల పంచాయితీ చామగడ్డ లో ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయింది.. దీంతో బాహ్య ప్రపంచంతో 30 గ్రామాలు సంబంధాలు తెగిపోయాయి… ఆసుపత్రికి వెళ్లే మార్గం లేకపోవడంతో అంటు రోగాలు అధికమవుతున్నాయి.
భారీ వర్షాలు కురుస్తుండడంతో మరోవైపు ఏజెన్సీలోని ఘాట్ రోడ్లను తాత్కాలికంగా వర్షాలు తగ్గేవరకు మూసి వేస్తున్నట్లు తెలిపారు అధికారులు.. అల్లూరు జిల్లా పాడేరు మండలం అల్లూరి జిల్లా పాడేరు మండలం రాయిగడ్డ వద్ద వాగు ఉధృతికి ఓ యువకుడు బైక్ తో పాటు కొట్టుకుపోయాడు. వాగు దాటే క్రమంలో వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో బైక్ తో పాటు యువకుడు సుమారుగా గంటసేపు వాగులో చిక్కుకున్నాడు. స్థానికులు అతి కష్టం మీద యువకుడ్ని కాపాడారు. ఇక భారీ వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లా దెబ్బపాలెం వద్ద గౌరమ్మ వాగు గెడ్డకు గండిపడి 150 ఎకరాల వరి పంట నీట మునిగింది… రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉండడంతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించారు జిల్లా కలెక్టర్లు..
మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు..