పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈనెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలు నిండుకుండలా మారాయి.. ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు గడ్డలు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు.. ఈ రోజు ఇప్పటికే గుంటూరు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
మిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై నగరం నిండుకుండలా మారింది. చెన్నై, కడలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.
తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాలతో సహా ఎనిమిది జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్ నాగపట్నంలలో కళాశాలలు కూడా మూసివేయబడ్డాయి.