CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ. సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు.. ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంలో నేరుగా ఆయా సంస్థల యజమానులతో సీఎం మాట్లాడారు. ఇప్పటి వరకు రాజధానిలో 72 సంస్థలకు 947 ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో స్కూళ్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, మత సంస్థలు, ఐటీ, టెక్ పార్కులు ఉన్నాయి.
Read Also: Bandi Sanjay: విద్యార్థులకు శుభవార్త.. 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్న బండి సంజయ్!
అయితే, అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని.. జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలు పెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ సందర్భంలోనూ, ఏ కారణంతోనూ జాప్యాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని మూడు సంస్థలు పేర్కొన్నాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని మరో 15 సంస్థలు వెల్లడించాయి. ఐదు నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని మరో 17 సంస్థలు తెలిపాయి. ప్రతి కంపెనీ, సంస్థ ప్రతినిధుల నుంచి ప్రణాళిక తెలుసుకుని, స్పష్టమైన హామీ తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం.