CM Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. చేనేతలో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం.. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200యూనిట్లు, పవర్ లూమ్ కు 500యూనిట్లు ఉచితంగా ఇస్తాం.. 5 శాతం జీఎస్టీని రీయింబర్స్ చేస్తాం.. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తాం.. అమరాతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Tollywood : అటు హీరోయిన్ ఇటు ఐటమ్ గర్ల్.. యంగ్ బ్యూటీకి ఫుల్ డిమాండ్
అలాగే, చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల… ఆంధ్ర రాష్ట్రానికి సంపద చేనేత అని సీఎం చంద్రబాబు అన్నారు. పొందూరు ఖద్దరును గాంధీజీ మెచ్చారు.. నాగరికతకు మూలం నేతన్న.. హరప్పా కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందింది.. కాకతీయుల కాలంలో నాణేలపైన చేనేతల ముద్రలు కనిపిస్తాయన్నారు. బ్రిటిష్ వారు వ్యాపారం కోసం ఇక్కడి నుంచి వచ్చి చేనేతల జీవితంపై ప్రభావం చూపారు.. అందుకే గాంధీజీ సైతం విదేశీ వస్త్రాలను బహిష్కరించి కేవలం స్వదేశీ బట్టలను మాత్రమే ఉపయోగించమని చెప్పారు.. చేనేతలకు తెలుగుదేశంతో అవినాభావ సంబంధం ఉంది.. చేనేతలకు మొదటగా ఉపాధి కల్పించిన నాయకుడు ఎన్టీఆర్.. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో చేనేతల కోసం రాజీ లేని పోరాటం చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.