తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ వారికి సంతాపం తెలిపింది. తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ హోదాలో భూపాల్ రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది.
ఈ ఏడాది మార్చి 26వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు ఆర్డినెన్సులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆగస్టు 13న, హౌసింగ్ బోర్డు చట్టానికి సంబంధించి చేయాల్సిన సవరణలపై జూన్ 25న మరో ఆర్డెనెన్సును ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు ఈ వీటి స్థానంలో నిర్దిష్టంగా బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించిన బిల్లు, విదేశీ టూరిస్టులపై దాడులు జరిగితే తీసుకోవాల్సిన చర్యల కోసం మరో బిల్లు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
దళితబంధు వంటి సరికొత్త పథకాలను సభ ముందుంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగింపు, ఆయన రాజీనామా నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈసారి కూడా కరోనా నిబంధనలను పాటిస్తూనే సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్ నిబంధనల పరిధిలో సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీస్, మీడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను ప్రస్తుతం సడలించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్ టీకాలు ఇవ్వనున్నారు.
తెలంగాణ శాసన సభ సమావేశాలు సోమవారం నుంచి వాడి వేడిగా జరుగుతాయని పరిశీలకులు బావిస్తున్నారు.