ప్రశ్నించేందుకే జనాల్లోకి వచ్చిన పార్టీ జనసేన అని ఆ పార్టీ అధినత పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఓ సారి ఆ హద్దును దాటి.. అధికారం దిశగానూ ప్రయత్నించారు. కానీ.. ఎన్నికల పోరులో చతికిలబడి.. శాసనసభలో ఒకే స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత సందర్భానుసారంగా జనాల్లోకి వెళ్తూ.. ప్రజా సమస్యలపై పోరాటాన్ని చేస్తున్నారు. అవి పార్టీకి ఎంత వరకూ మైలేజ్ ఇస్తున్నాయన్నదే.. శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ బలం, బలగం ముందు.. జనాల్లో అంతగా కలవలేకపోతున్నామన్న ఆవేదన సైతం జన సైనికుల్లో అంతర్గతంగా ఉంది. అందుకు.. పార్టీ నాయకత్వం అవలంబిస్తున్న విధానం కారణమా.. సరైన మార్గదర్శకత్వం కొరవడడం కారణమా.. అన్నది చాలా కాలంగానే జనసేన కార్యకర్తల నుంచి ఆఫ్ ద రికార్డ్ గా అభిప్రాయాలు వినిపించాయి. ఈ వరసలో.. తాజాగా రోడ్ల సమస్యలపై పోరాటం విషయం కూడా చేరింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెడిపోయిన రోడ్ల విషయంలో జనసేన శ్రేణులు పోరాటాన్ని సలిపాయి. విస్తృతంగా జనాల్లోకి వెళ్లాయి. అక్కడితో ఆగకుండా.. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల వివరాలు క్రోడీకరించాలని.. వాటిపై పోరాటాన్ని చేయాలని పార్టీ అధినేత పవన్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఒకేసారి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తేనే.. ప్రభుత్వం కదిలి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం స్పందించినా.. వర్షాకాలం అయిపోయి డిసెంబర్ వచ్చే వరకూ.. సమస్యగానే ఉంటుంది కదా.. అని అసలు విషయాన్ని బయటికి తీస్తున్నారు. అప్పటివరకూ వానలు పడితే.. ఇప్పుడు ప్రభుత్వం స్పందించినా.. మళ్లీ రోడ్లు చెడిపోతాయన్న వాస్తవాన్ని వెల్లడిస్తున్నారు. కాబట్టి.. నిర్మాణాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి సమర్పిస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయాన్ని కొందరు జనసైనికులు వెల్లడిస్తున్నారు.
పోరాటం మంచిదైనా.. పార్టీకి తగిన మైలేజ్ వచ్చేలా చేస్తేనే.. ఎంతో కొంత జనంలో బలం పుంజుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అధినేత పవన్ ఆ దిశగా.. తమను ముందుకు తీసుకువెళ్లాలని.. కోరుకుంటున్నారు. మరింత ప్రభావాత్మకమైన సమస్యలను గుర్తించి.. జనంలోకి ఇంకా విస్తృతంగా వెళ్లాలని ఆశిస్తున్నారు. మరి.. పవన్ ఏం చేస్తారు.. ఎలా ముందుకు వెళ్తారు.. అన్నది.. ముందు ముందు చూడాల్సిందే.