క్రైమ్ త్రిల్లర్ సినిమాల్లో ట్విస్టులు, మలుపులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేగా! మొదట్నుంచీ చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగుతూ, మధ్యలో ఊహించని ట్విస్టులతో షాకిస్తూ.. చివర్లో మరో మైండ్‌బ్లోయింగ్ మలుపుతో త్రిల్లర్స్ ముగుస్తాయి. సరిగ్గా అలాంటి త్రిల్లింగ్ స్టోరీనే రియల్ లైఫ్‌లో జరిగింది. తమ కుటుంబ సభ్యులతో పోరాడి ప్రేమ వివాహం చేసుకున్న ఆ అమ్మాయి, చివర్లో ఆ అబ్బాయికి పెద్ద శఠగోపమే పెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పాట్నాకు చెందిన ఓ ప్రేమ జంట.. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగిపోయారు. దీంతో, పెళ్లి చేసుకొని సెటిలవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. తాము చెప్పింది చేయపోయే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించినా, ఆ జంట వినిపించుకోలేదు. ఒక్కటవ్వాలని గట్టిగా ఫిక్సయ్యారు. అయితే.. లేచిపోతే ఫ్యామిలీ పరువు పోతుందని, వారిని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చివరికి వారి పోరాటం ఫలించింది. పెళ్లికి కుటుంబసభ్యుల్ని ఒప్పించారు. బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని రోజులపాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది కూడా!
కట్ చేస్తే.. పెళ్లైన 45 రోజుల తర్వాత అమ్మాయి ఊహించని షాకిచ్చింది. భర్తను వదిలేసి.. అతని ఇంట్లోని కొంత నగదు, నగలు తీసుకొని.. మాజీ ప్రియుడితో పరారైంది. ఆ పెళ్లి తంతు కొనసాగుతున్న క్రమంలో.. మాజీ ప్రియుడు తిరిగి ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు. పెళ్లయ్యాక ఆ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అంతే, ఈ క్రమంలోనే ఆ అమ్మాయి 45 రోజుల వ్యవధిలోనే ప్రియుడతో జంప్ అయ్యింది. పాపం ఆ భర్త.. అన్నీ వదులుకొని, ఫ్యామిలీతో పోరాడి పెళ్లి చేసుకుంటే.. తన సుఖం కోసం ఆ అమ్మాయి అతడ్ని నట్టేట ముంచి పారిపోయింది.