దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే… దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.
బిశ్రక్ గ్రామంలో…
ఢిల్లీ సమీపంలోని బిశ్రక్ గ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వస్తుంది. ఆ ఊళ్లోనే ఒకప్పుడు రావణాసురుడు పుట్టాడని నమ్ముతారు. నార్త్ ఇండియాలో దసరా, దీపావళి రెండు పండుగలూ రామాయణంతో ముడిపడి ఉంటాయి. దసరా రావణుడు చనిపోయిన రోజు అయితే దీపావళి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. అందుకే దసరా రోజున నార్త్ ఇండియాలో రావణ దహనం జరిపితే.. దీపావళి రోజున రాముడి ఆగమనానికి గుర్తుగా దీపాలు వెలిగిస్తారు. అయితే బిశ్రక్ గ్రామంలో ఈ రెండు పండుగలను పట్టించుకోరు. తమ వాడైన రావణున్ని చంపేసి పండుగ చేసుకుంటున్న రోజు కాబట్టి దసరా దీపావళి ఇక్కడ జరుపుకోరు.
పండగ జరుపుకోకపోవడానికి కారణమిదే..
విశ్రవసు అనే మహర్షి పేరు మీద ఆ ఊరికి “బిశ్రక్” అనే పేరు వచ్చిందని అక్కడి వారు చెబుతుంటారు. ఆయనను కలిసిన కైకసి అనే రాక్షస యువరాణి తనకు ఆయన వల్ల పిల్లలు కలగాలని కోరగా ఆమె అడిగిన సమయం అసుర సంధ్య అని కాబట్టి ఆమెకు రాక్షసులు పుడతారని విశ్రవసుడు చెప్పాడు. దానికి కైకసి ఆయన లాంటి గొప్ప వాడికి రాక్షసులు పుట్టడం సరికాదని బతిమాలుగా ఆమెకు పుట్టే మగపిల్లల్లో చివరివాడు జ్ఞాని అవుతాదని, చిరంజీవిగా బతుకుతాడని చెప్పాడు. అతడే విభీషణుడు. పెద్ద వాళ్ళిద్దరూ రావణుడు, కుంభకర్ణుడు. వీళ్ళందరూ పుట్టింది తమ గ్రామంలోనే అని బిస్రక్ వాళ్ళు చెబుతారు. ఎదిగిన తర్వాత లంకకు వెళ్లి అక్కడ నుంచి రాజ్యం చేశారని వారి నమ్మకం.
కేరళలో దీపావళి జరుపుకోరు..
అంతే కాకుండా.. దేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా దీపావళి పండుగను జరుపుకోరు. రాష్ట్రంలోని కొచ్చి నగరంలో మాత్రమే దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కేరళ రాజు మహాబలి దీపావళి రోజున మరణించాడని నమ్ముతారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ దీపావళి పండుగ జరుపుకోవడం లేదు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి మరో కారణం ఏమిటంటే హిందూ మతానికి చెందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, దీని వల్ల పటాకులు, దీపాలు వెలిగించరని కూడా చెబుతున్నారు.
తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో..
తమిళనాడు రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దశి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు శ్రీ కృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఈ రోజును ఛోటీ దీపావళిగా జరుపుకుంటారు.