సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ప్రతీతి. పైగా నటనను పులుముకొని సాగే సినిమా రంగంలో అసలైన స్నేహానికి తావేలేదనీ చెబుతుంటారు. అయితే, అలాంటి అభిప్రాయాలు తప్పు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు.
నాగిరెడ్డి-చక్రపాణి
అలాంటి వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఒక తల్లి పిల్లల్లాగా చక్రపాణి, నాగిరెడ్డి మసలుకున్నారు. తెలుగు చిత్రసీమలో విలువలతో కూడిన చిత్రనిర్మాణం సాగించారు ఈ ఇద్దరు మిత్రులు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు, తరువాత వచ్చిన “పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, సి.ఐ.డి.” వంటి ఆణిముత్యాలతో పాటు పలు హిందీ, తమిళ చిత్రాలనూ అందించారు. చివరి చిత్రం ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’. మిత్రుడు చక్రపాణి మరణించిన తరువాత విజయా బ్యానర్ పై మళ్ళీ సినిమాలు నిర్మించలేదు నాగిరెడ్డి. విజయా-వాహినీ వంటి అతిపెద్ద స్టూడియో ఉండి కూడా, స్టార్స్ అందరూ తన చుట్టూ తిరిగేవారు ఉన్నా చక్రపాణి పోయాక నాగిరెడ్డి చిత్ర నిర్మాణంపై మనసు లగ్నం చేయలేకపోయారు. ఎప్పుడో ఒకటి అర అనువాద చిత్రాలు అందించారు.
బాపు -రమణ
ఇక చిన్నతనం నుంచీ మిత్రులుగా ఉంటూ, పత్రికా రంగంలో ఒకరు బొమ్మతోనూ, మరొకరు రాతతోనూ అలరించారు బాపు, ముళ్ళపూడి వెంకటరమణ. చిత్రసీమలో ప్రవేశించిన తరువాత కూడా బాపు-రమణ బంధం కడదాకా విడిపోకుండా సాగింది. బాపు తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ రమణ రాతలు ఉండేవి. ‘శ్రీరామాంజనేయయుద్ధం’ చిత్రానికి కూడా రమణ చేయి చేసుకున్నా, నాటక కర్తల పేరే వేసి, తన పేరు ప్రచురించుకోలేదు. వారి కాంబోలో వచ్చిన “సాక్షి, ముత్యాలముగ్గు, సంపూర్ణరామాయణం, బుద్ధిమంతుడు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు” వంటి చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరగా వారు రూపొందిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’. ఆ సినిమా అయ్యాక రమణ కన్నుమూశారు. కొన్నాళ్ళకే బాపు కూడా రమణ దగ్గరకు ప్రయాణం కట్టారు. చిత్రసీమలో స్నేహం అనగానే వినిపించే పేర్లలో బాపు-రమణ ముందు వరుసలోనే ఉంటారు.
రజనీకాంత్ – మోహన్ బాబు
ఆపదలో ఆదుకున్నవాడే అసలైన ఆత్మీయుడు అంటారు. మోహన్ బాబు, రజనీకాంత్ అలా ఒకరికొకరు సహాయం చేసుకున్న మంచిమిత్రులు. రజనీకాంత్ తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’. ఆ సినిమా రీమేక్ ‘తూర్పు-పడమర’. తమిళంలో రజనీ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు ధరించారు. ఇద్దరూ చిత్రసీమలో ఒక్కోమెట్టూ ఎక్కుతూ పైకి వచ్చిన వారే. ఇద్దరికీ ఆ తరువాత స్నేహం కుదిరింది. రజనీకాంత్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో మోహన్ బాబు ఆయన చిత్రాలలో ప్రతినాయకునిగా నటించారు. తెలుగులో రజనీకాంత్ కు అవకాశాలు కల్పించడంలోనూ మోహన్ బాబు పాత్ర ఉంది. ఇలా తనను ఆదుకున్న మిత్రుడు కాసింత తగ్గినప్పుడు రజనీకాంత్ వచ్చి సాయం చేశారు. ‘పెదరాయుడు’ చిత్రాన్ని అదేపనిగా రైట్స్ ఇప్పించి, అందులో తాను ఓ కీలక పాత్ర పోషించి రజనీకాంత్, మోహన్ బాబుతో తన స్నేహబంధాన్ని చాటుకున్నారు. ఆ తరువాత కూడా ఈ ఇద్దరు మిత్రుల బంధం గురించి చిత్రసీమలో చెప్పుకుంటూనే ఉన్నారు.
మరి కొన్ని స్నేహబంధాలు…
కష్టంలో, నష్టంలో పాలు పంచుకున్నవారే అసలైన మిత్రులు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి గతాన్ని తలచుకుంటే వారు సినిమా రంగంలో రాణించక ముందు స్వీట్స్ ఎలా అమ్మారు. తమ కలల రాజ్యమైన చిత్రసీమలో ఎలా ప్రవేశించారు అన్న విషయాలు సినిమా కథలు తలపిస్తాయి. వారి ఇద్దరి కాంబోలో “రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, వినోదం” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ వచ్చాయి. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎవరు చిత్రాలు నిర్మించినా, సదరు సినిమాలకు అచ్చిరెడ్డి చక్కటి ప్రణాళికతో సినిమాలు అనుకున్న సమయానికి జనం ముందు నిలిచేలా చేసేవారు. అలా సాగిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అనుబంధం గురించి చిత్రసీమలో స్నేహం అన్న మాట ప్రస్తావనకు వచ్చిన ప్రతీసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు.
నటుడు శివాజీరాజా, హీరో శ్రీకాంత్ మైత్రీబంధం కూడా ఎన్నదగినదే. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ ఆ ఇద్దరు మిత్రులు ఇప్పటికీ మునుపటిలాగే సాగుతున్నారు. ఒకప్పుడు హీరోలుగా అందరినీ అలరించిన జగపతిబాబు, అర్జున్ సైతం రియల్ లైఫ్ లో మంచి మిత్రులు. అలాగే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ స్నేహబంధం కూడా తక్కువేమీ కాదు. త్రివిక్రమ్ సినిమాలతోనే సునీల్ పేరు సంపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సునీల్ హీరోగా సక్సెస్ రూటులో సాగి, తరువాత మళ్ళీ కమెడియన్ గా నటిస్తున్నారు. ఇప్పటికీ త్రివిక్రమ్ తన మిత్రుడు సునీల్ కు తగ్గ పాత్రలు సృష్టిస్తూనే ఉండడం విశేషం. ఇలా రంగుల ప్రపంచం సినిమా రంగంలోనూ పలువురు తమ స్నేహబంధంతో ఆకట్టుకుంటున్నారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.