నేషనల్ హైవేపై ప్రయాణించే సమయంలో అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏమైనా ఉంటుందంటే అది టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించడమే. అయితే టోల్ ప్లాజా ఫీజుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కొత్త నిబంధన తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ లేకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. అది ఏంటంటే.. వాహనదారులు 10 సెకన్‌ల కంటే ఎక్కువ సేపు నిరీక్షిస్తే టోల్ పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల దూరంలో ఉండే పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉండరాదు. ఒకవేళ పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీతకు ముందున్న వాహనాలు టోల్ ఛార్జీలు చెల్లించకుండా వెళ్లిపోవచ్చు. అంటే పసుపు గీత పొడవు 100 మీటర్ల లోపు వచ్చే వరకు వాహనాలు ఛార్జీలు చెల్లించకుండా వెళ్లిపోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఈ నిబంధన ఉందని చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా టోల్ ఫీజు కట్టకుండా వెళ్లిపోయేందుకు టోల్ ప్లాజా యాజమాన్యాలు అంగీకరించడం లేదు. అయితే కేంద్ర నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చు.
కాగా టోల్‌ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం పెంచేందుకు, వాహనాలు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకురాగా ఈ నిబంధనపై అవగాహన లేకపోవడం సరిగ్గా అమలు కావడం లేదు. ఇప్పటికే టోల్ ప్లాజా దగ్గర రద్దీ తగ్గించేందుకు ఫాస్టాగ్ నిబంధనను తీసుకువచ్చినా వాహనదారులు అరకొరగానే దీనిని వినియోగిస్తున్నారు.