Highest Salary in India: ప్రముఖ కంపెనీల సీఈవోలకు లక్షల్లో, కోట్లల్లో శాలరీ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓ కంపెనీ సీఈవో ఏకంగా ఏడాదికి రూ.123 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి.విజయ్ కుమార్. ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా విజయ్ కుమార్ నిలవడం విశేషం. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు రూ.123.13 కోట్ల వేతనం అందించినట్లు పేర్కొంది. దీంతో ఆయన వేతనం విషయం బహిర్గతమైంది. విజయ్ కుమార్ ఆదాయంలో నాలుగింట మూడొంతులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో పొందుపరచబడిందని హెచ్‌సీఎల్ కంపెనీ స్పష్టం చేసింది.
Read Also: ఈ ఉద్యమాలను ప్రారంభించిన వ్యక్తులు ఎవరో తెలుసా?
విజయకుమార్ వార్షిక మూల వేతనం రెండు మిలియన్లు అని.. వేరియబుల్ పే కింద మరో మిలియన్ డాలర్లు పొందారని హెచ్‌సీఎల్ కంపెనీ వివరించింది. అయితే తమ కంపెనీ నుంచి విజయకుమార్ ఎలాంటి వేతనం పొందలేదని, తమ అనుబంధ సంస్థ ‘హెచ్ సీఎల్ అమెరికా ఇంక్’ నుంచి దీర్ఘకాలిక ప్రోత్సాహకం సహా 16.52 మిలియన్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 123. 13 కోట్లు పారితోషికం అందుకున్నారని హెచ్‌సీఎల్ కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది .మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి విజయ్ కుమార్ 0.02 మిలియన్ల మొత్తం ఇతర ప్రయోజనాలను పొందినట్లు తెలిపింది. హెచ్‌సీఎల్ కంపెనీ దీర్ఘకాలిక ప్రోత్సాహం కింద అందించిన 12.50 మిలియన్ల మొత్తంతో ఆయన జీతం16.52 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. దీర్ఘకాలిక ప్రోత్సాహకం అనేది సీఈవో చేరుకునే మైలురాళ్ల ఆధారంగా నిర్ణీత వ్యవధిలో అంటే రెండు సంవత్సరాల పూర్తికాలంలో చెల్లిస్తామని హెచ్‌సీఎల్ కంపెనీ తెలిపింది.